: ఆ గాయక దిగ్గజం ఇందిరాగాంధీని సైతం లెక్కచేయలేదు!


హిందీ సినిమాలతో పరిచయం ఉన్న వారికి కిశోర్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గాన గంధర్వుడి కంఠంలో ఎన్నో గీతాలు జీవం నింపుకున్నాయి. ముఖ్యంగా 'గైడ్' సినిమాలో 'గాతా రహే మేరా దిల్...', 'అభిమాన్' చిత్రంలోని 'తేరే మేరే మిలన్ కి యే రైనా', 'ఆరాధన' సినిమాలోని 'మేరే సప్నోంకీ రాణీ', 'చల్తీ కా నామ్ గాడీ' మూవీలోని 'ఏక్ లడ్కీ బీగీ బాగీ సీ'... ఇలాంటి మధుర గీతాలెన్నింటికో... కిశోర్ కుమార్ తన అమృతతుల్యమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడే కాకుండా నటుడు, ఫిలింమేకర్, స్క్రిప్ట్ రైటర్ కూడా. అన్నింటికి మించి అపార ధైర్యశాలి, అభిమానధనుడు. ఎంతంటే.... అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చేటంత! ఎమర్జెన్సీ సమయంలో ఇందిర 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళికను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళే క్రమంలో కిశోర్ కుమార్ ఓ ప్రత్యేక గీతం పాడితే బాగుంటుందని ఆమె తలచారు. అనుకున్నదే తడవుగా కొందరు అనుచరులను కిశోర్ కుమార్ నివాసానికి పంపారు. వారు వచ్చి ఆదేశిస్తున్న తరహాలో విషయం చెప్పడంతో ఆయనలో ఆగ్రహం పెల్లుబికింది. 'మీరేంటి నాకు చెప్పేది?' అంటూ బెంగాలీ భాషలో తిట్ల పురాణం లంకించుకున్నారు. దీంతో, ఆ వచ్చినవారు బిక్కచచ్చిపోయారు. వారు ఇంటి గేటు దాటిందాకా కిశోర్ కుమార్ ధారాళంగా తిట్ల వర్షం కురిపించారట. కానీ, ఈ సంఘటనను ఇందిరాగాంధీ సీరియస్ గా తీసుకున్నారు. పర్యవసానం... ఆలిండియా రేడియాలో ఆ మధురగాయకుడి గొంతు వినిపించరాదంటూ నిషేధం విధించారు!

  • Loading...

More Telugu News