: ప్రేమ ఒకరితో... పెళ్లి మరొకరితో!


విజయవాడలో పీటల మీది పెళ్లి ఆగిపోయింది. ఒక యువతితో ప్రేమాయణం సాగించిన యువకుడు పెళ్లి చేసుకునేందుకు మాత్రం ముఖం చాటేశాడు. ఇవాళ విజయవాడలోని సత్యనారాయణపురంలో మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఆ ప్రేమికురాలు హఠాత్తుగా పెళ్లి మండపం వద్ద ప్రత్యక్షమై, జరిగిన విషయం చెప్పడంతో పీటల మీది పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. సత్యనారాయణపురానికి చెందిన సిరి, ప్రతాప్ లు ప్రేమలో పడ్డారు... శారీరకంగా కూడా వారు దగ్గరయ్యారు. ఫలితంగా సిరి గర్భవతయింది. దీంతో, సిరిని పెళ్లిచేసుకోవాలంటూ యువతి తల్లిదండ్రులు ప్రతాప్ తల్లిదండ్రులను నిలదీయడంతో పెళ్లి చేసేందుకు వారు అంగీకరించారు. అయితే, ప్రతాప్ మానసికంగా అప్ సెట్ అయ్యాడని, కొద్ది రోజుల తర్వాత వివాహం చేస్తామని వారు నమ్మబలికారు. త్వరలో పెళ్లి జరుగుతుందని భావించిన సిరికి నిరాశే ఎదురైంది. కాగా, ఇవాళ ఉదయం సత్యనారాయణపురంలో రాజ్యలక్ష్మి అనే యువతిని ప్రతాప్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న సిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ప్రతాప్ తల్లిదండ్రులను కూడా పోలీసులు సత్యనారాయణపురం పీఎస్ కు తరలించి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృథా అయ్యాయి. సిరి గురించి పోలీసులు ప్రతాప్ ను అడుగగా... ఆ అమ్మాయి తనకు తెలుసునని, సత్యనారాయణపురంలో ఉన్న సిరిని ప్రేమించిన మాట కూడా వాస్తమమేనని చెప్పాడు. అయితే, సిరికి పుట్టిన బిడ్డకు, తనకు మాత్రం సంబంధం లేదని చెప్పడంతో పోలీసులు తలపట్టుకున్నారు. ఆ బిడ్డకు డీఎన్ ఏ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఈ కేసులోని చిక్కుముడిని విప్పాలని వారు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News