: 2016 నుంచి వైద్యులకు విధిగా గ్రామీణ సేవ!
వైద్య విద్యార్థులు తమ వైద్య విద్య పూర్తయిన తర్వాత ఇకపై విధిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సిందే. అంతేకాదండోయ్.., వైద్య విద్య పూర్తైన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చేస్తామంటే కుదరదు. వైద్య విద్య పూర్తి అయిన మరుక్షణమే గ్రామసీమలకు తరలివెళ్లాల్సిందేనట. లేకపోతే, వారి పేర్లు భారతీయ వైద్య మండలి (ఏపీ చాప్టర్)లో నమోదు కావట. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 నుంచి ఈ నిబంధన తప్పనిసరిగా అమలు కానుంది. అంటే, 2010లో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన వైద్య విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుందన్నమాట. వైద్యవిద్య పూర్తి చేసుకున్న తర్వాత వైద్యులు, గ్రామీణ ప్రాంతాల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో యూపీఏ హయాంలోనే కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్య విద్య పూర్తి చేస్తున్న వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేని కారణంగానే సదరు ప్రాంతాల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయన్నభావనతో సర్కారు ఈ మేరకు తీర్మానించింది. గడచిన ఏడెనిమిదేళ్లుగా ఈ నిబంధన అమలు, ఏటా వాయిదా పడుతూనే వస్తోంది. మరోవైపు ఈ నిబంధన, తమకు కాస్త ఇబ్బంది కలిగించేదేనని వైద్య వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీంతో రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలన్న నిబంధనకు, ఏడాది పాటు చేస్తే చాలంటూ సవరణ జరిగిపోయింది. దీనిపై వైద్యులు కూడా సానుకూలంగానే స్పందించి, ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఈ నిబంధనను తక్షణమే అమలులోకి తీసుకురావాలని సర్కారు భావించింది. అయితే ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న కొందరు వైద్యులు, పీజీ, సూపర్ స్పషాలిటీ కోర్సులను అభ్యసించే క్రమంలో వివిధ దశల్లో ఉన్న నేపథ్యాన్ని పరిశీలించిన ప్రభుత్వం, 2010 లో ఎంబీబీఎస్ లో చేరిన వారికి వర్తిస్తే సరిపోతుందని తీర్మానించింది. వైద్య విద్య పూర్తి చేసుకున్న మరుక్షణమే గ్రామీణ ప్రాంత సేవలు చేసేస్తే, తదనంతరం వారు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ముగించిన తర్వాత మళ్లీ గ్రామ సీమలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కూడా తాజా నిబంధనలు వెల్లడిస్తున్నాయి. 2016 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండవన్న మాట.