: తప్పుచేసిన పాక్ బౌలర్ బరిలో దిగేందుకు తహతహ!


ప్రతిభకు లోటులేని క్రికెటర్లలో పాకిస్థాన్ కు చెందిన యువపేసర్ మహ్మద్ అమీర్ ఒకడు. అయితే, ఇంగ్లండ్ గడ్డపై స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు తేలడంతో ఐసీీసీ అతడిపై ఐదేళ్ళ నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. అయితే, అమీర్ ను అంతకుముందే బరిలో దించాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. అమీర్ శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ బోర్డు అధికారులు ఐసీసీకి దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారంపై అక్టోబర్ లో తుది నిర్ణయం వెలువడనుంది. వన్డే వరల్డ్ కప్ 2015 వేసవిలో జరగనుండడమే పాక్ తొందరపాటుకు కారణంగా తెలుస్తోంది. దీనిపై అమీర్ (22) మాట్లాడుతూ, సుదీర్ఘ నిరీక్షణ అసహనం కలిగిస్తోందని, ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అని ఉత్సుకతగా ఉందని తెలిపాడు. అయితే, అక్టోబర్ వరకు ఏమీ చెప్పలేనని అన్నాడు. తన వ్యవహారాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్ళినందుకు పీసీబీకి కృతజ్ఞతలు తెలిపాడు. పీసీబీ చర్యతో తనలో ఉత్సాహం పెల్లుబుకుతోందని చెప్పుకొచ్చాడీ లెఫ్టార్మ్ స్పీడ్ స్టర్. అతి పిన్న వయస్సులోనే 50 టెస్టు వికెట్లు సాధించిన రికార్డు ఈ పాక్ బౌలర్ పేరిటే ఉంది.

  • Loading...

More Telugu News