: ట్రాఫిక్ పోలీసులపై ఏసీబీ అధికారుల దాడులు
విధినిర్వహణలో మామూళ్లు మరిగిన ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాయకుండానే వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఫిర్యాదునందుకున్న ఏసీబీ అధికారులు దాడి చేశారు. శనివారం బేగంపేట పరిధిలో డ్రంకన్ డ్రైవ్ వాహనదారులను నిరోధించే నిమిత్తం కాపుకాసిన ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేసినా, చలాన్లు రాయలేదు. దీంతో బాధితుల నుంచి సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దాడి చేశారు. ఈ సందర్భంగా లెక్కాపత్రంలేని రూ. 16 వేల పైచిలుకు డబ్బు పోలీసుల వద్ద లభించింది. దీనిపై వివరాల వెల్లడికి నోరు విప్పని పోలీసులు మౌనం పాటించారు. దీంతో వారిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ దాడిలో పక్కాగా బుక్కైన వారిలో ఓ సీఐ, ఏఎస్సై, తొమ్మిది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.