: కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం: టీఎస్ హోంమంత్రి నాయిని
ఫేక్ కరెన్సీ ముఠా దాడిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబానికి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై వెంకటరెడ్డిని హోంమంత్రి కొనియాడారు. ముఠా సభ్యులను పట్టుకునేందుకు ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలను చూసి గర్విస్తున్నామని తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోందని... చికిత్స కోసం ఎంత ఖర్చైనా భరిస్తామని... ఆయనకు ఏమీ కాకుండా చూసుకుంటామని చెప్పారు. జరిగిన ఘటన తమకు ఓ కనువిప్పులాంటిదని నాయిని అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫేక్ కరెన్సీ ముఠాను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.