: కాశ్మీరీ పండిట్ల పవిత్ర యాత్రకు అనుమతించని ఒమర్ అబ్దుల్లా... రాజుకున్న కొత్తవివాదం


కాశ్మీర్లో మరో వివాదం రాజుకుంటోంది. కాశ్మీరీ పండిట్లు ప్రతీ యేటా పవిత్రంగా చేసే కౌసర్ నాగ్ యాత్రకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నిరాకరించడం వివాదస్పదమవుతోంది. కాశ్మీరీ పండిట్లకు ప్రతీ సంవత్సరం కౌసర్ నాగ్ యాత్ర చేయడం ఆనవాయతీ. జమ్మూలోని రియాసీ జిల్లా నుంచి కౌసర్ నాగ్ యాత్ర ప్రారంభమవుతుంది. నడక ద్వారా కౌసర్ నాగ్ సరస్సును చేరుకుని... అక్కడ ఆరు రోజులపాటు పూజాదికాలు నిర్వహించడం తరతరాలుగా కాశ్మీరీ పండిట్ల సంప్రదాయం లో భాగం. ప్రతీ ఏడాది లాగే బుధవారం సుమారు 4,000 మంది కాశ్మీరీ పండిట్లు కౌసర్ నాగ్ యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే వేర్పాటు వాదుల ఒత్తిడితో హఠాత్తుగా గురువారం నాడు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ యాత్రకు బ్రేక్ వేశారు. ఈయాత్ర వల్ల కౌసర్ నాగ్ సరస్సు ప్రాంతం చుట్టూ వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని వేర్పాటువాదులు గొడవ చేస్తున్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు... కాశ్మీర్ లో ముస్లింలను తరిమివేయడానికి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమే ఈ యాత్ర అని వేర్పాటువాద నాయకుడు సయద్ అలీ గిలానీ వ్యాఖ్యానించారు. ఒమర్ అబ్దుల్లా నిర్ణయంతో 4,000 మంది పండిట్లు యాత్ర ప్రారంభించి... కొద్ది దూరంలో ఆగిపోయారు. ఈ నిర్ణయంపై కాశ్మీరీ ఓవర్ సీస్ అసోసియేషన్ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంపై మండిపడింది. తాము అత్యంత పవిత్రంగా భావించే కౌసర్ నాగ్ యాత్ర విషయంలో కలుగజేసుకోవాలని అమెరికాలో స్థిరపడిన కాశ్మీరీ పండిట్లు మోడీకి లేఖ రాశారు. మోడీ సర్కార్ వచ్చిన వెంటనే ఉగ్రవాదుల వల్ల కాశ్మీర్ ను ఖాళీ చేసిన పండిట్లకు తిరిగి కాశ్మీర్ లో పునరావాసం కల్పించేందుకు హామీ ఇచ్చిందని వారు మోడీకి లేఖలో గుర్తుచేశారు. ఈ విషయంలో కూడా మోడీ కలుగజేసుకుని తమను కౌసర్ నాగ్ యాత్ర చేసుకోనివ్వాలని ఎన్ఆర్ఐ కాశ్మీరీ పండిట్లు కోరుతున్నారు. వేర్పాటువాదులు కౌసర్ నాగ్ యాత్ర వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని దుష్పప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. కొన్ని శతాబ్దాలుగా తమ పూర్వీకులు ఈ యాత్రను చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లోని ప్రతీ చెట్టు, చేమ, కొండ, కోన తమకు అత్యంత పవిత్రమైనవని మోడీకి రాసిన లేఖలో కాశ్మీరీ పండిట్లు స్పష్టం చేశారు. కొన్ని వేల సంవత్సరాలుగా తాము కాశ్మీర్ కు సంరక్షకులుగా ఉన్నామని... అలాంటి తాము కాశ్మీర్ పర్యావరణాన్ని ఎందుకు పాడుచేస్తామని వారు మోడీకి రాసిన లేఖలో ఆక్రోశించారు. వేర్పాటువాద కార్యక్రమాలు నిర్వహిస్తూ... కాశ్మీర్ వాతావరణాన్ని అల్లకల్లోలం చేస్తున్నవారు తమను ఆక్షేపించడం పట్ల కాశ్మీరీ పండిట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఈ విషయంలో కలుగజేసుకుని తమను కౌసర్ నాగ్ యాత్ర చేేసుకోనివ్వాలని వారు మోడీని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News