: ఇంతకీ బుల్లితెరపై చిరంజీవి కనిపిస్తాడా?


మెగాస్టార్ చిరంజీవి టీవీలో సందడి చేస్తున్నాడా? ఇప్పుడీ అంశంపైనే అందరి చర్చ. వెండితెరపైన హల్ చల్ చేసిన చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టారు. సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవి కనిపించి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. అయితే, ఇప్పుడు బుల్లితెరపై చిరంజీవి ఓ ఎపిసోడ్ లో పాల్గొంటున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో రికార్డులను నెలకొల్పుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్ ప్రముఖ హీరో నాగార్జున అక్కినేని అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22 తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ లో చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వార్తలు వెలువడ్డాయి. దాంతో తమ అభిమాన నటుడిని బుల్లితెరపై వీక్షించవచ్చునని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ, వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతూ ఇప్పుడు చిరు పాల్గొనడం లేదంటూ మరో వార్త పుట్టుకొచ్చింది. సోనీ టెలివిజన్ లో ఆగస్టు 11వ తేదీ నుంచి ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభమవుతోంది. దాంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాంతీయ ఛానెళ్లలో ఈ కార్యక్రమం ప్రసారం చేయకూడదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11వ తేదీ నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీవీలో మెగాస్టార్ కనబడటం డౌటేనని అంటున్నారు. అయితే, మెగాస్టార్ అభిమానుల కోసం ఎలాగైనా చిరంజీవిని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు సదరు టీవీ ఛానల్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరు టీవీ తెరపై కనిపించినా అభిమానులకు పండుగే మరి!

  • Loading...

More Telugu News