: ఢిల్లీలో కత్తులు దూసుకుంటున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ
ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక దానిపై మరొకటి కత్తులు దూసుకుంటున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని తమ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలో త్వరలో జరగబోయే ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను అంటిస్తున్నందుకు నలుగురు ఆప్ కార్యకర్తలను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేయడమే కాకుండా.. వాళ్ల కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ సర్కార్ పై కారాలు, మిరియాలు నూరుతోంది. ఢిల్లీ నగరం మొత్తం బీజేపీ పోస్టర్లతో నిండి ఉందని, బీజేపీ కార్యకర్తలు నగరం మొత్తాన్ని కాషాయపు రంగు పోస్టర్లతో నింపుతున్నప్పుడు చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు... తమ కార్యకర్తలు నాలుగు పోస్టర్లు అంటిస్తుంటే మాత్రం అరెస్ట్ చేశారని ఆమ్ ఆద్మీ సీనియర్ నాయకుడు సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పోలీసులు ఇకపై కూడా ఇలాగే ప్రవర్తిస్తే, తాము ఢిల్లీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తామని ఆయన పోలీసులను హెచ్చరించారు.