: మమ్మల్ని మహారాష్ట్రలో కలపాలి: బెల్గాం జిల్లా మరాఠీ ప్రజలు
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా మరాఠీ వాసుల సమస్య తాజాగా కర్నాటక, మహారాష్ట్రల మధ్య రాజకీయ వివాదాన్ని రేపింది. బెల్గాం జిల్లాలోని మరాఠీ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు మహారాష్ట్రకే చెందుతాయంటూ బెల్గాం జిల్లాలోని యెల్లూరు గ్రామం దగ్గర అక్కడి స్థానిక ప్రజలు బోర్డు పెట్టారు. దీనిపై హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం కర్ణాటక పోలీసులు ఈ బోర్డును తీసివేశారు. దీంతో అక్కడి గ్రామస్థులు 'మహారాష్ట్ర రాజ్య' అంటూ మరో బోర్డును శనివారం మళ్లీ పెట్టారు. శనివారం వెలిసిన మరో బోర్డును కూడా పోలీసులు తీసివేయడంతో... ఆదివారం గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెల్గాం జిల్లాలోని మరాఠీ ప్రజలపై పోలీసులు ఆదివారం చేసిన లాఠీఛార్జి సోమవారం నాటికి రాజకీయ రంగు పులుముకుంది. మరాఠీ ప్రజలపై కర్నాటక పోలీసులు గూండాగిరి చేస్తున్నారని శివసేన గళమెత్తింది. కొన్ని దశాబ్దాలుగా కర్ణాటకలోని మరాఠీ గ్రామాలను మహారాష్ట్రలో కలపాలని ఉద్యమం చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ్ సమతి పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించింది. ఇక ఈ విషయంపై ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే బీజేపీని... దాని మిత్రపక్షమైన శివసేనను తీవ్రంగా దుయ్యబట్టారు. కర్ణాటకలో కొన్ని దశాబ్దాలుగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న మరాఠా ప్రజలంటే బీజేపీ-శివసేన కూటమికి ఏమాత్రం సానుభూతి లేదని ఆయన వ్యాఖ్యానించారు.