: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ ఐపీఎస్ పై విచారణ
మోడల్ ను అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరస్కార్ను పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. ముంబై పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సునీల్‌ను పిలిపించుకుని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (క్రైమ్) శరద్ రౌత్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కలా గావిట్ దాదాపు నాలుగు గంటల పాటు పరస్కార్ ను ప్రశ్నించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని ఉన్నతాధికారులు నమోదు చేశారు. అవసరమైతే ఆయనను మరోసారి ప్రశ్నిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా మోడల్ తనకు తెలుసునని, అయితే తాను ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తనను లైంగికంగా వేధించడంతో పాటు, ముంబై శివారుల్లోని ఓ హోటల్ లో అత్యాచారం చేశాడని ఓ మోడల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క పరస్కార్ బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.