: ఎడతెరపి లేకుండా కురిసిన వాన... గోదారిగా మారిన రహదారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వాన కురిసింది. దేవరపల్లి దగ్గర యాదవోలు వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, అరుంధతీ పేటలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిడదవోలు మండలం ఎర్రన్నగూడెం వద్ద రోడ్డుపై నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. విజయవాడ మొగల్రాజరాజపురంలో కొండచరియలు విరిగిపడటంతో ఆటో, బైక్ ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలుగజేయగా... అన్నదాతలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలతో వారు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.