: చంద్రబాబు రుణమాఫీ చేయడంతో జగన్ కు మతిభ్రమించింది: సిపిఐ కార్యదర్శి రామకృష్ణ


రుణమాఫీపై టీడీపీకి, వైసీపీకి మధ్య జరుగుతున్న పోరులో తాజాగా మరో పార్టీ ప్రవేశించింది. రుణమాఫీపై ఏపీ ప్రభుత్వాన్ని రైతులు, మహిళలు అభినందిస్తున్నారని అధికారపక్షం... పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఈ గొడవలోకి తాజాగా సీపీఐ కూడా ప్రవేశించింది. రొటీన్ గా ప్రతిపక్షానికి బాసట ఇవ్వకుండా... వెరైటీగా అధికార పక్షం తరపున మాట్లాడుతూ ఏపీ రాజకీయవర్గాలను సీపీఐ ఆశ్చర్యానికి గురిచేసింది. గుంటూరులో జరిగిన కౌలు రైతుల సభలో సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ రుణమాఫీ విషయంలో జగన్ ప్రవర్తిస్తున్న విధానాన్ని దుయ్యబట్టారు. రుణమాఫీ విషయంలో జగన్ మతితప్పి మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్ కు... చంద్రబాబు రుణమాఫీ అమలు చేయడంతో షాక్ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో... 40 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం సామాన్యమైన విషయం కాదని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. లక్షన్నర రుణమాఫీతో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కు ఏమి చేయాలో పాలుపోక నరకాసుర వధ వంటి మతిలేని కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాడని ఆయన చురక అంటించారు. రుణమాఫీ విషయంలో టీడీపీకి సీపీఐ మద్దతు పలకడంతో... ఈ విషయంలో వారికి మరింత బలం చేకూరింది.

  • Loading...

More Telugu News