: అధికారులను భారత్ ప్రతినిధులుగా పొరబడిన అమెరికా సెనేటర్
అమెరికా సెనేటర్ క్లర్ట్ క్లాసన్ ఇద్దరు భారత సంతతి అధికారులను భారత ప్రభుత్వ ప్రతినిధులుగా పొరబడ్డారు. ఇటీవలే అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఆసియా, పసిఫిక్ వ్యవహారాలపై ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగం సహాయ కార్యదర్శి నిషా దేశాయ్ బిస్వాల్, సహాయ వాణిజ్య కార్యదర్శి (గ్లోబల్ మార్కెట్లు) అరుణ్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే, తన ప్రసంగం సందర్భంగా క్లాసన్ వీరిద్దరినీ భారత ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరైన ప్రతినిధులుగా భావించారు. "మీ దేశాన్ని ఎంతో ఇష్టపడతానని, మీ దేశానికి నేనెంతో సన్నిహితుణ్ణి" అని నిషా, అరుణ్ లను ఉద్దేశించి అన్నారు. రక్షణ పరంగానే కాకుండా, ఆర్థికాభివృద్ధి రీత్యాను భారత్ తో చెలిమి అమెరికాకు ఎంతో అవసరమని క్లాసన్ పేర్కొన్నారు. అంతేగాకుండా, అమెరికాలో భారత సంస్థల పెట్టుబడుల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను ఆ ఇద్దరు భారత్ ప్రభుత్వానికి చెబుతారన్న ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు క్లాసన్. సెనేటర్ అభిమతాన్ని అర్థం చేసుకున్న నిషా తిరిగి జవాబిస్తూ, "ఇదంతా భారత ప్రభుత్వానికి తెలియాలన్నదే మీ ఉద్దేశమని అర్థమైంది"అని తెలిపారు. అమెరికా ప్రభుత్వం తరఫున ఈ విషయాలను భారత్ ప్రభుత్వానికి చేరవేస్తామని చెప్పారు. అప్పుడు గానీ అర్థంకాలేదు క్లాసన్ కు జరిగిన పొరబాటు ఏమిటో. ఆ మరుసటి రోజే క్షమాపణ చెప్పాడీ సెనేటర్. కాగా, క్లాసన్ కు భారత్ తో నిజంగానే సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనకు పుణేలో కొన్ని ఫ్యాక్టరీల్లో భాగస్వామ్యం ఉంది. అంతేగాకుండా, ఆయన తెలుగు, తమిళం అర్థం చేసుకోగలరు. హైదరాబాద్ బిర్యానీ తన ఫేవరెట్ వంటకంగా చెబుతుంటారు.