: ఆగస్ట్ 15న 'పిడికిలి' బిగిస్తున్న పవన్ కల్యాణ్!
పవన్ కల్యాణ్ ఈ ఆగస్ట్ 15న తన పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించనున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా వస్తున్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టేందుకు స్వాతంత్ర్య దినోత్సవాన జనసేన ఎన్నికల గుర్తును ప్రకటించాలని పవన్ టీం భావిస్తోంది. పార్టీ గుర్తుగా 'పిడికిలి'ని ఎన్నుకున్నట్లు జనసేన విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు కూడా పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ఓ వైపు 'గోపాల గోపాల' షూటింగ్ లో పాల్గొంటూనే... మరో వైపు జిల్లాల వారీగా తాత్కాలిక కమిటీల ఏర్పాటుకు పవన్ తన అనుచరులతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేనను విస్తరించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.