: ఢిల్లీలో కేసుల్లో ఇరుక్కున్న 18,645 మంది మందుబాబులు
18,645 మంది మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి జూలై 15 వరకు ఢిల్లీలో 9,941 వాహనాల్లో, 6,235 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 18,645 మంది విచారణ ఎదుర్కొంటున్న వాహనదారుల్లో 11,028 ద్విచక్రవాహనదారులుండగా, ఇతరులు 5,468 మంది ఉన్నారు. 2,149 మంది డ్రైవర్లు, 23 మంది ఛార్టర్డ్ బస్ డ్రైవర్లు, ఆరుగురు స్కూల్ బస్ డ్రైవర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడి విచారణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని రాత్రి 10:30 నుంచి తెల్లవారు వరకు 80 ప్రాంతాల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో వీరంతా పట్టుబడ్డారని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు. 16,937 మందికి డ్రైవింగ్ విధానంపై కౌన్సిలింగ్ నిర్వహించామని ఆయన వెల్లడించారు. తాము పట్టుకున్న వారిలో కొంత మంది భారీ జరిమానా కట్టి బయటపడగా, మరింత మంది శిక్ష అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. కేసులు నమోదు చేస్తున్నా, జరిమానాలు పడుతున్నా కొంత మంది మారడం లేదని అలాంటి వారికి శిక్షలు పడుతున్నాయని ఆయన వివరించారు.