: మద్యం తాగి పట్టుబడుతున్న పైలెట్లు
విమానప్రయాణికుల భద్రత కోసం తరచూ నిర్వహించే తనిఖీల్లో తాగుబోతు పైలెట్లు దొరికిపోతున్నారు. 2011 నుంచి ఇప్పటివరకు భారత్ లో నిర్వహించిన తనిఖీల్లో 99 మంది పైలెట్లు మందుకొట్టి పట్టుబడ్డారట. పార్లమెంటులో విమానయాన శాఖ మంత్రి జీఎం సిద్ధేశ్వర చెప్పిన వివరాలివి. ఈ ఏడాది ఇప్పటివరకు 10 మంది పైలెట్లు మద్యం తాగి విధులకు హాజరైనట్టు తేలిందని మంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో భారత విమానయాన రంగంలో పలు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడం తెలిసిందే. పలువురు నకిలీ సర్టిఫికెట్లతో పైలెట్ అవతారం ఎత్తడం, దొంగ లైసెన్స్ లతో పైలెట్లకు ట్రైనింగ్ ఇవ్వడం వంటి సంఘటనలు కూడా వెలుగుచూశాయి. మార్చి నెలలో ఓ విమానంలో ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసిన సిబ్బంది ఓ బాలీవుడ్ గీతానికి చిందులెయ్యడం చర్చనీయాంశం అయింది.