: మానవత్వం మరణించిన వేళ..!


అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో మనిషిని చేర్చాల్సిన సమయం ఆసన్నమైంది! మానవుడి విశిష్ట గుణమైన మానవత్వాన్ని మ్యూజియంలో పెట్టాల్సిన తరుణం ఇంకెంతో దూరంలో లేదనిపిస్తోంది! ఎందుకంటే, సాటి మనిషికి సాయం చేయాల్సిన మనిషే తనలోని మానవీయతను స్వయంగా హత్య చేసుకున్న సుదినం (?) నేడే కాబట్టి! జైపూర్లో ఈరోజు జరిగిన ఓ యాక్సిడెంట్ ను, తదనంతర పరిణామాలను చూసినవారెవరికైనా, మనమూ మనుష్యులమేనా? అన్న భావన కలగకపోతే సిగ్గుపడడం కాదు, చచ్చిపోవాలి!

జీవితంలో తనతోపాటు కష్టసుఖాల్లో తోడుగా ఇప్పటివరకూ సాగిన భార్య రోడ్డుపై దిక్కులేనిదానిలా పడి ఉండగా ఆ భర్త పడిన ఆవేదన, ఆమెను కాపాడుకోవాలని అతను చూపిన ఆరాటం చూస్తే.. మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా మాత్రం పుట్టకూడదు అనిపించేలా గుండెలు బరువెక్కించింది. విషయం ఏంటంటే, తన భార్య ఇద్దరు పిల్లలతో ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళుతుండగా ఓ వాహనం వారి బైక్ ను ఢీకొట్టింది. ఆ దుర్ఘటనలో భార్య, కుమార్తె చనిపోయారు. ఆ వ్యక్తి, చిన్న పిల్లాడు ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే తన భార్య, కుమార్తె కొనఊపిరితో ఉన్న సమయంలో ఆ వ్యక్తి సాయం చేయండంటూ రోడ్డుపై వెళ్ళే ప్రతి ఒక్కరిని దీనంగా వేడుకోవడం కలచివేసింది.

అయితే, తమకెందుకులే అనుకున్న జైపూర్ వాసులు వారిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు, మానవత్వాన్ని నడిరోడ్డుపై మరోసారి చంపేశారు. ఆ వ్యక్తి ఓపక్క తన కుమారుడిని సముదాయించుకుంటూ, మరోపక్క విగతజీవుల్లా పడి ఉన్న భార్య, కుమార్తెలను చూసుకుంటూ బిగ్గరగా రోదిస్తున్నా.. కరకు గుండెలు కరగకపోవడం చూస్తే ఏమనాలి? డార్విన్ పరిణామ సిద్ధాంత క్రమంలో భాగంగా మనిషి మనసును రాతిపొరలు కమ్మేశాయని అనుకోవాలేమో!!.

  • Loading...

More Telugu News