: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాలర్ ను అతని తల్లి పురిట్లోనే వదిలించుకోవాలనుకుంది
పోర్చుగీసు ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఆటతీరుకు ముగ్ధుడవని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాడిగా పేరొందిన రొనాల్డో, బంతిని కాళ్లతో నియంత్రిస్తూ గోల్ కొట్టే తీరును ముచ్చటపడే అభిమానులు అతని ఆటంటే పడిచస్తారు. అలాంటి రొనాల్డోను అతని తల్లి పురిట్లోనే అంతం చేసేందుకు సిద్ధపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. రొనాల్డో తల్లి తన జీవిత గాథను మదర్ కరేజ్ అనే పుస్తకంలో పొందుపరిచింది. రొనాల్గో కడుపులో పడగానే పిండాన్ని వదిలించుకునే పనిలో పడింది. గర్భస్రావానికి ప్రయత్నించింది కానీ డాక్టర్ ఆమె ప్రయత్నాన్ని విరమింపచేశారు. డాక్టర్ తో లాభం లేదనుకున్న ఆమె, తీవ్రమైన శారీరక ఒత్తిడివల్ల గర్భస్రావమవుతుందనే ఉద్దేశంతో కఠినమైన ఎక్సర్ సైజుల్ని చేయడం మొదలు పెట్టింది. అయినా ఆమె అనుకున్న ఫలితం సాధించలేదు. ఇక లాభం లేదనుకుని వెచ్చని బీరు ఎక్కువగా తాగడం మొదలు పెట్టింది. అలసిపోయేంతవరకు పరుగెత్తడం వంటివి ఆమె చేసింది. అయినా సరే గర్భస్రావం జరగలేదు. దీంతో ఆమె క్రిస్టియానో రొనాల్డోకు జన్మనిచ్చింది. రొనాల్డో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాలర్ గా ఎదగడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ విషయాన్ని రొనాల్డోకు కూడా చెప్పానని... దీంతో, తనను దెప్పిపొడుస్తూ ఆటపట్టిస్తుంటాడని ఆమె వెల్లడించింది.