: శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం తలదూర్చడం సరికాదు: మంత్రి యనమల


శాసనమండళ్ల రద్దు, ఏర్పాటు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడకుండా ఒక జాతీయ విధానం ఉండాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా లేఖలు రాయడంపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. మండలి ఉండాలా? వద్దా? అనేది రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 168, 169 కింద మండలిపై రాష్ట్రాలకు హక్కు ఉందని చెప్పారు. మండలి రద్దు విషయంలో కేంద్రం ప్రమేయం ఉండదని, రద్దు చేయాలంటే 2/3 వంతు సభ్యులు అసెంబ్లీలో తీర్మానం చేయాలని పేర్కొన్నారు. కాబట్టి, మండలి ఏర్పాటు, రద్దు విషయంలో కేంద్రం తలదూర్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. మండలిని రద్దు చేయడమంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాలరాయడమేనన్న యనమల, రాజ్యాంగానికి భంగం వాటిల్లేలా వ్యవహరించరాదన్నారు. అయితే, ఈ విషయాలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన వెల్లడించారు. దీనిపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే యోచనలో ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News