: సునీల్ నరైన్ 'సూపర్'


టి20 ఫార్మాట్ కు అతికినట్టు సరిపోయే బౌలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు... సునీల్ నరైన్. ఈ విండీస్ యువ స్పిన్నర్ తన విలక్షణ ఎత్తుగడలతో బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించడంలో దిట్ట. ముఖ్యంగా క్యారమ్ బాల్ ప్రయోగంలో ఇతడిది అందెవేసిన చేయి. తాజాగా, తన సూపర్ ప్రదర్శనతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గయానా జట్టుకు విజయాన్నందించాడు. ఈ లీగ్ లో భాగంగా గయానా, రెడ్ స్టీల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత స్కోర్లు సమమయ్యాయి. ఇరు జట్లు 20 ఓవర్లలో 118 పరుగులు చేశాయి. దీంతో పోరు సూపర్ ఓవర్ కు దారితీసింది. గయానా ఆరు బంతుల్లో 12 పరుగులు చేయగా, బదులుగా, రెడ్ స్టీల్ బ్యాట్స్ మన్ నికోలస్ పూరన్ బరిలో దిగాడు. బంతినందుకున్న నరైన్ ఒక్క పరుగు ఇవ్వకుండా ఆ ఓవర్ ను మెయిడెన్ చేశాడు. అంతేకాదు. ఆ ఓవర్లో ఐదో బంతికి పూరన్ ను బలిగొన్నాడు. ఆరో బంతిని ఎదుర్కొన్న రాస్ టేలర్ సైతం పరుగు సాధించలేకపోయాడు. దీంతో, గయానా జట్టులో ఆనందం అంబరాన్నంటగా, రెడ్ స్టీల్ ఆటగాళ్ళు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, క్రికెట్ చరిత్రలో సూపర్ ఓవర్ మెయిడెన్ కావడం ఇదే తొలిసారి. దీంతో, ఈ భారత సంతతి స్పిన్నర్ చరిత్ర పుటల్లోకెక్కాడు.

  • Loading...

More Telugu News