: అమర్‌నాథ్ యాత్రలో అల్లర్లు... చిక్కుకున్న 200మంది తెలుగువారు
అమర్‌నాథ్ యాత్రలో శుక్రవారం అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో అమర్‌నాథ్ పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన యాత్రికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బల్తాల్ బేస్‌క్యాంపులో లాంగార్లు (వంటవారు), ఇతరులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో 20మంది గాయపడ్డారు. స్థానిక టెంటు యజమాని నయీబ్ అహ్మద్‌కు, మరో వ్యక్తికి మధ్య ఏర్పడిన చిన్న గొడవ చినికిచినికి గాలివానగా మారి కత్తిపోట్లకు, హింసాత్మక సంఘటనలకు దారితీసింది. దుండగులు టెంట్లకు నిప్పుపెట్టడంతో 300 టెంట్లు కాలిపోయాయి. దీంతో సైన్యం యాత్రను నిలిపేసింది. అమర్‌నాథ్ యాత్ర నిలిచిపోవడంతో వేలమంది భక్తులు బల్తాల్ లో దీనంగా గడుపుతున్నారు. యాత్రికులకు సైన్యం భారీ భద్రతను కల్పించింది. యాత్రికుల్లో 200 మంది తెలుగువారున్నారు. అల్లర్లను పూర్తిగా అదుపు చేసి యాత్ర ప్రశాంతంగా సాగేలా చూడాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరారు.