: 'వార్న్ హాట్.. ద్రావిడ్ కూల్' అంటోన్న పొడుగుకాళ్ళ సుందరి


ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెటర్లతో సినీతారలు మమేకం కావడం బాగా ఎక్కువైంది. రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు బాలీవుడ్ స్టార్లే సహయజమానులన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ కు శిల్పాశెట్టి, పంజాబ్ జట్టుకు సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింతా, కోల్ కతా ఫ్రాంచైజీకి షారూఖ్.. ఇలా క్రికెట్-సినిమాయణం సంయుక్తంగా సాగిపోతోంది.

తమ జట్టు గెలిస్తే ఆటగాళ్ళకు ముద్దులు, ఓడితే నిట్టూర్పులు.. ఇది ప్రీతీ జింతా స్టయిల్. ఇక రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ శిల్పా శెట్టి స్టయిలే వేరు. ఆటగాళ్ళను ఎలా పొగడితే ఫలితాలు వస్తాయో తెలుసుకునీ మరీ కాకా పడుతోన్నట్టుంది. ఈ క్రమంలో ప్రస్తుత సారథి రాహుల్ ద్రావిడ్ ను 'వెరీ కూల్ బాయ్' అంటూ ఆకాశానికెత్తేస్తోంది. నిన్న జైపూర్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించిన అనంతరం ఈ పొడుగుకాళ్ళ సుందరి తన వాక్చాతుర్యం ప్రదర్శించింది. పనిలోపనిగా రాయల్స్ పూర్వ సారథి షేన్ వార్న్, ద్రావిడ్ ల మధ్య తేడాలేంటో వివరించింది.

నాయకత్వపరంగా వార్న్ ను 'వెరీ హాట్' అని అభివర్ణించిన ఈ ముద్దుగుమ్మ.. ద్రావిడ్ ఎంతో సంయమనశీలి అంటోంది. మైదానంలో ఏది ఎప్పుడు చేయాలో అదే చేస్తాడని, అంతిమంగా అదే జట్టుకు మేలు చేస్తుందని కితాబిచ్చింది. అయితే, వార్న్ మాత్రం ద్రావిడ్ లా కాకుండా మైదానం వెలుపలా, లోపలా కూడా దూకుడే అని వెల్లడించింది.

  • Loading...

More Telugu News