: మైక్రోసాఫ్ట్ ‘కోత’ ప్రభావం భారత్ లో తక్కువే!


ఏడాది వ్యవధిలోగా ఏకంగా 18,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. అయితే ఈ కోతల ప్రభావం భారత్ లో స్వల్పంగానే ఉంటుందని ఆ సంస్థకు చెందిన భారత వర్గాలు పేర్కొంటున్నాయి. సంస్థ ప్రారంభమైన 39 ఏళ్ల నాటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలకనుండటం ఇదే తొలిసారి. కొన్ని నెలల క్రితం మైక్రోసాఫ్ట్, మొబైల్ హ్యాండ్ సెట్ దిగ్గజం నోకియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. నోకియా సంస్థను కొనుగోలు చేసిన దరిమిలా, ఆ కంపెనీలోని ఉద్యోగులు కూడా మైక్రోసాఫ్ట్ లోకి వచ్చేశారు. దీంతో మైక్రోసాఫ్ట్ పై ఉద్యోగుల భారం పడిపోయింది. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు మైక్రోసాఫ్ట్ సిబ్బందితో నోకియాను పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో ఈ భారీ కోతలు తప్పడం లేదన్నది మైక్రోసాఫ్ట్ వాదన. ఈ మేరకు గురువారం సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో తెలిపారు. ఉద్వాసనకు గురి కానున్న 18 వేల మంది ఉద్యోగుల్లో, 13 వేల మందికి పైగా నోకియాకు చెందిన వారేనని మైక్రోసాఫ్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న సిబ్బంది కోతల ప్రభావం భారత్ లో స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ కు భారత్ కీలక మార్కెట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాక భారత్ లో ఆ సంస్థకు నోకియా నుంచి వచ్చిన సిబ్బందితో కలుపుకుని కేవలం 6,500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది ఉద్వాసన ప్రభావం భారత్ లో అతి స్వల్పంగానే ఉంటుందని ఆ సంస్థ భారత ప్రతినిధి చెప్పారు.

  • Loading...

More Telugu News