: అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం: కేసీఆర్
సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో 43 అంశాలపై చర్చ జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన స్వయంగా మీడియాకు వివరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించామని ఆయన చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని ఆయన తెలిపారు. అమరవీరుల కుటుంబం అంతటికి వైద్యసహాయం, గృహ వసతి కల్పించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. బంగారం రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీతో ప్రభుత్వానికి రూ.19 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని కేసీఆర్ చెప్పారు. 39 లక్షల 7 వేల 409 కుటుంబాలకు రుణమాఫీ వల్ల లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.