: పైరసీపై హీరో విశాల్ ఫిర్యాదు... ఇద్దరి అరెస్టు
ఇటీవలే విడుదలైన రెండు కొత్త తమిళ చిత్రాలు టీవీలో ప్రసారమవుతుండడం పట్ల హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ సినిమాల పైరసీకి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... విశాల్ తానే హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'పూజై' సినిమా షూటింగ్ కోసం కారైక్కుడి వెళ్ళారు. షూటింగ్ పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు తాను బస చేసిన హోటల్ కు వెళ్లారు. టీవీ చూస్తుండగా, లోకల్ చానళ్ళలో కొత్త సినిమాలు ప్రసారమవుతుండడం పట్ల విస్మయం చెందారు. వెంటనే, పైరసీ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మహ్మద్ మంజూర్, సంపత్ అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద పైరసీ సీడీలు, కంప్యూటర్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తారని, అలాంటి శ్రమ పైరసీ ద్వారా నీరుగారిపోవడం చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు హీరో విశాల్.