: బిన్నీ ఎంపికపై అప్పుడు అలా... ఇప్పుడు ఇలా..!


స్టూవర్ట్ బిన్నీ... లేటు వయసులో టీమిండియా బెర్త్ సంపాదించిన ఆటగాడు. కర్ణాటకకు చెందిన ఈ ఆల్ రౌండర్ క్రికెట్ కుటుంబం నుంచి వచ్చినవాడే. తండ్రి రోజర్ బిన్నీ భారత జట్టుకు పేస్ బౌలర్ గా సేవలందించారు. కాగా, స్టూవర్ట్ బిన్నీ ప్రతిభ చాన్నాళ్ళుగా తెరవెనుకే మిగిలిపోయింది. కెప్టెన్ ధోనీ గుర్తించడంతో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకోగలిగాడు. అయితే, ఇంగ్లండ్ తో తొలి టెస్టుకు ముందు 30 ఏళ్ళ బిన్నీని తుదిజట్టులోకి ఎంపిక చేయడంపై విమర్శలు వినిపించాయి. ఎవరైనా కుర్రాళ్ళను ప్రోత్సహిస్తే బాగుండేదని మాజీ క్రికెటర్లు సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ, ధోనీ తన ఎంపికపై విశ్వాసముంచాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 145 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. కోహ్లీ (8), రహానే (24), ధోనీ (11) విఫలమైన స్థితిలో బరిలో దిగిన బిన్నీ చక్కని ఇన్నింగ్స్ లో భారత్ ను 300 పరుగుల స్కోరు దాటించాడు. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బిన్నీ అవుటైనా అప్పటికే భారత్ సురక్షిత స్థితికి చేరుకుంది. ఒక్క ఇన్నింగ్స్ తో ఎంత మార్పు..! ఇప్పుడందరూ బిన్నీ ఎంపిక సరైనదేనని ధోనీని అభినందిస్తున్నారు. భారత్ లో ఓ మతంలా అవతరించిన క్రికెట్ లో ఇది సర్వసాధారణం అనుకోవాలేమో.

  • Loading...

More Telugu News