: వరల్డ్ కప్ గెలిచినా...గెలవకున్నా అర్జెంటీనాతో కటీఫ్
24 ఏళ్ల తరువాత అర్జెంటీనా జట్టును ఫిఫా వరల్డ్ కప్ లో ఫైనల్ కు తీసుకెళ్లిన ఘనత ఆ జట్టు కోచ్ అలెజాండ్రో సాబెల్లాది. సమర్ధవంతులైన క్రీడాకారులను మ్యాచ్ లో దించి సరైన ప్రణాళికలు రచించిన సాబెల్లా అర్జెంటీనాను ఫైనల్ వరకు తీసుకెళ్లారు. అర్జెంటీనా కోచ్ గా అలెజాండ్రో దిశానిర్థేశంలో అర్జెంటీనా జట్టు 26 మ్యాచ్ లలో విజయం సాధించగా, పది మ్యాచ్ లను డ్రాలుగా ముగించింది. కాగా, ఫీఫా వరల్డ్ కప్ తరువాత ఆయన అర్జెంటీనా కోచ్ విధుల నుంచి వైదొలగనున్నారు. అర్జెంటీనా జట్టుకు కోచ్ గా రావాలని చాలా మంది కలలు కంటారని, అందుకే తాను ఫీఫా వరల్డ్ కప్ తరువాత కోచ్ గా ఉండనని అలెజాండ్రో చాలాసార్లు పేర్కొన్నారు. ఆయన జీవితకాలం మొత్తం అర్జెంటీనా కోచ్ గా పనిచేసేందుకు ప్రయత్నిచారని, ఇప్పుడు ఆ విధుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని అలెజాండ్రో ఏజెంట్ వెల్లడించారు. మూడో ప్రపంచకప్ టైటిల్ పోరు కోసం అలెజాండ్రో సేన సిద్ధమవుతోంది. గతంలో రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా ప్రవేశించింది.