: 16+5.. వీరందరికీ ఉరి తప్పదా?


దేవేందర్ పాల్ సింగ్ భుల్లర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. మరణశిక్ష మాఫీ కోసం చూస్తున్న 16 మంది దోషులకు రుచించనిదే. మరణశిక్ష అమలు ఆలస్యం అయిందన్న కారణంతో దానిని జీవిత ఖైదుగా మార్పు చేయడం కుదరదంటూ దేవేందర్ పాల్ సింగ్ భుల్లర్ కేసులో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. భుల్లర్ దాఖలు చేసుకున్న శిక్ష తగ్గింపు అభ్యర్థనను కొట్టివేసింది. సుప్రీం చెప్పిన దాని ప్రకారం మరో 16 మందికీ ఉరిశిక్ష మాఫీకి ద్వారాలు మూసుకుపోయినట్లే. అంతేకాదు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వేచి ఉన్న మరో ఐదుగురి మీదా ప్రభావం చూపనుంది.

కర్ణాటక రాష్ట్రంలో ల్యాండ్ మైన్ పేల్చి పోలీసులను హతమార్చిన కేసులో స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు నలుగురికి మరణశిక్ష పడగా, వారి క్షమాభిక్ష పిటిషన్ ను ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. మరణశిక్ష ఆలస్యమైనందున శిక్ష తగ్గించాలంటూ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు స్టే విధించింది. ఇలా 16 మంది ఇప్పడు శిక్ష మాఫీ కోసం చూస్తున్నారు. వీరంతా రాష్టప్రతి క్షమాభిక్ష తిరస్కరణకు గురైన వారే. వీరితోపాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బయాంత్ సింగ్ హత్య కేసు నిందితుడు బబ్సర్ ఖల్సా తీవ్రవాది రాజోనా, శివు, జాదేస్వామి, ఉమేశ్, మగన్ లాల్ క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో వీరికి క్షమాభిక్ష గగనమే కానుంది. మొత్తం మీద తీవ్రమైన కేసులలో దోషులుగా ఉన్న వీరి విషయంలోనూ సుప్రీం జాలి తలచకపోవచ్చని భుల్లర్ కేసులో స్పందన ఆధారంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News