: విపక్ష నేత పదవి కోసం సంతకాల సేకరణలో కాంగ్రెస్


లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తన యత్నాలను ముమ్మరం చేసింది. నిన్నటిదాకా డిమాండ్లతో పాటు కోర్టుకెక్కుతామంటూ అధికార పక్షానికి బెదిరింపు సంకేతాలు పంపిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మంగళవారం సంతకాల సేకరణలో మునిగిపోయింది. అధికార పార్టీ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన తమకు విపక్ష నేత పదవి ఇవ్వాల్సిందేనని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. అయితే అధికార పక్షం నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం సంతకాల సేకరణకు దిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే మెజార్టీ సభ్యుల సంతకాలను సేకరించామని, ప్రస్తుతం అందుబాటులో లేని సభ్యుల సంతకాలను కూడా త్వరలోనే సేకరించి, సదరు లేఖను లోక్ సభ స్పీకర్ కు అందజేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. తమతో పాటు యూపీఏ సభ్య పార్టీల నుంచి ఎన్నికైన సభ్యులతో కలిపి తమ బలం సభలో 64 ఉందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఇతర పార్టీలకు తగినంత బలం లేదన్న సాకుతో లోక్ సభలో విపక్ష నేత పదవి లేకుండానే కాలం వెళ్లదీసిన దృష్టాంతాలను అధికార పార్టీ వర్గాలు ఉదహరిస్తున్నాయి. అధికార పార్టీ వాదనతో విభేదిస్తున్న కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాత్రం, సభలో రెండో అతిపెద్ద పార్టీ ప్రతిపాదించిన సభ్యుడికి విపక్ష నేత పదవి ఇవ్వాల్సిందేనని చట్టం చెబుతోందని వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News