: నేను చెత్త సింగర్ ని అయినా పాడేశా:సల్మాన్ ఖాన్
'కిక్' సినిమాలో తాను పాడిన 'హేంగోవర్' పాటకు మంచి ఆదరణ లభించినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ ఇదే తన మొదటి పాట అనేంత హైప్ రావడం ఆశ్చర్యంగా ఉందని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ముంబైలో 'కిక్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చాలా చెత్తగా పాటలు పాడతానని తనకు తెలుసని అన్నాడు. అయినా సరే అభిమానులు తన పాటను ఆదరించారని అన్నాడు. అయితే ఇదే తన తొలి గీతం అయినట్టు వ్యాఖ్యలు రావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు. తానింతకు ముందు 'హలో బ్రదర్', 'వాంటెడ్' సినిమాల్లో పాటలు పాడానని తెలిపాడు. ఆ రెండు పాటలే 'హేంగోవర్' పాట కంటే శ్రద్ధగా పాడానని అన్నాడు. అయినా హేంగోవర్ పాటకి వచ్చినంత ఆదరణ వాటికి రాలేదని సల్లూభాయ్ తెలిపాడు. తనక్కూడా ఇదేదో తొలిపాట అనేంత ఫీలింగ్ వచ్చిందని సల్మాన్ తెలిపాడు. తెలుగులో రవితేజ నటించిన 'కిక్' సినిమాకి రీమేకే సల్లూభాయ్ 'కిక్' సినిమా. గతంలో మహేష్ బాబు 'పోకిరి'ని 'వాంటెడ్' గా తీసి సల్మాన్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు 'కిక్' పాటలు, ట్రైలర్ సామాజిక మాథ్యమాల్లో మంచి ఆదరణ చూరగొన్నాయి.