: డిగ్గీ రాజాకు మధ్యప్రదేశ్ హైకోర్టు వాతలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరువు మంటగలిసిపోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనకు వాతలు పెట్టింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ ఆయన దాఖలు చేసిన లేఖా పిటిషన్ పై మండిపడి కొట్టివేసింది. రాజకీయ కుస్తీ పోటీలకు న్యాయస్థానాలు వేదిక కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లేఖ రాయడం ద్వారా కోర్టును ఒక విషయంపై డిమాండ్ చేయడం తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. న్యాయస్థానాలు నిర్దిష్ట ప్రక్రియలను అనుసరిస్తాయని చెబుతూ, 'న్యాయప్రక్రియను అనుసరిస్తూ పిటిషన్ దాఖలు చేయండి' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ అలోక్ అరాధే లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.