: రంగరాజన్ నివేదికపై ముప్పేట దాడి


పేదరిక నిర్ధారణకు గీటురాయిగా పరిగణించే దారిద్ర్య రేఖ పరిమితిని నివేదిస్తూ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ కమిటీ సమర్పించిన నివేదికపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించాయి. అటు విపక్షాలతో పాటు ఇటు అధికార పార్టీ భాజపా కూడా విస్మయం వ్యక్తం చేసింది. రోజుకు పట్టణాల్లో రూ. 47, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 32ల కంటే ఎక్కువగా ఖర్చు చేసే వారంతా ధనికులేనని రంగరాజన్ కమిటీ నివేదిక ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నివేదికపై సోమవారమే బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలు విరుచుకుపడగా, తాజాగా మంగళవారం కాంగ్రెస్ పార్టీతో పాటు భాజపా కూడా ఆగ్రహం వెళ్లగక్కింది. రంగరాజన్ కమిటీ సిఫార్సులు సవ్యంగా లేవు. దీనిపై సరైన సమయంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ఇక రంగరాజన్ కమిటీని నియమించిన కాంగ్రెస్ పార్టీ కూడా నివేదికపై మండిపడింది. అయితే, రంగరాజన్ ను వెనకేసుకొచ్చే యత్నం చేసింది. 'కమిటీ నివేదన ప్రతిపాదనలకు సంబంధించి వాస్తవాలను పరిశీలిస్తాం. ఏదేమైనా రంగరాజన్ గొప్ప ఆర్థికవేత్త. నివేదికపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సి ఉంది. ఆ తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది‘ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. మరోవైపు వామపక్షాలు కూడా నివేదికపై నిప్పులు చెరిగాయి. రంగరాజన్ కమిటీ నివేదిక అర్థం లేనిదని సమాజ్ వాదీ పార్టీ ఆక్షేపించింది. 'రంగరాజన్ కు రోజుకు రూ. 100 ఇస్తాం, గ్రామీణ ప్రాంతంలో కొన్ని రోజులైనా గడిపి వస్తే చూస్తాం' అంటూ ఆ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News