: నేటి నుంచి పార్లమెంట్ సమరం... అస్త్రశస్త్రాలతో సిద్ధమైన విపక్షాలు
ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఈ నెల 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్థిక సర్వే, 10న కేంద్ర బడ్జెట్ సమర్పణ ఉంటాయి. ఈ సమావేశాల్లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయకపోవడం వల్ల... వివిధ శాఖలకు చెందిన పద్దులను సంబంధిత కమిటీలకు నివేదించకుండానే ఈసారి ఉభయసభలు బడ్జెట్ ను ఆమోదిస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఈనెల 31లోగా ముగిస్తారు. అయితే ప్రధానమైన అంశాలన్నింటిపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.
మరోవైపు, పెట్రోల్, రైల్వే ఛార్జీల పెరుగుదల, నిత్యావసరాల ధరలు అదుపులోకి రాకపోవడం వంటి అంశాలపై విపక్షాలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కావాల్సినన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న విపక్షాలు పార్లమెంటులో వేడి పుట్టించడం ఖాయం.