: బాంబు భయంతో వణికిపోయిన హార్వర్డ్ యూనివర్శిటీ
అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ బాంబు భయంతో వణికిపోయింది. తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బాంబు అమర్చాడన్న వార్త శనివారం దావానలంలా వ్యాపించింది. దీంతో, వర్శిటీ విద్యార్థులతోపాటు అధ్యాపకగణం కూడా తీవ్ర భయాందోళనలకు లోనైంది. క్యాంపస్ లోని ఐవీ లీగ్ స్కూల్ కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తంగా ఉండాలంటూ ఐవీ లీగ్ స్కూల్ తమ విద్యార్థులను ఈమెయిల్ ద్వారా హెచ్చరించింది.
సమాచారం అందుకున్న వెంటనే కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ పోలీసులు క్యాంపస్ లోని నాలుగు భవనాలనుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. అనంతరం, అణువణువు క్షుణ్ణంగా గాలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఓ నల్లటి పెట్టెను గుర్తించినా, అందులో పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.