: జగన్ కు ఉరిశిక్ష వేసినా ఫరవాలేదంటోన్న మంత్రిగారు
అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఉరివేసినా ఫరవాలేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంచల్ గూడ జైలును పార్టీ కార్యాలయంలా మార్చేసి రాష్ట్ర వ్యాప్తంగా దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ దోపిడీకి భారీ సంఖ్యలో అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ కుటుంబ సభ్యులు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనం విమర్శించారు. జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ సైతం తనవంతుగా భూకబ్జాలకు పాల్పడుతూ, నిరుపేదల స్థలాలను ఆక్రమించి ప్రార్థనామందిరాలు నిర్మిస్తున్నాడని ఆరోపించారు. అంతేగాకుండా బయ్యారం గనుల్లోనూ చేతివాటానికి పాల్పడ్డారని తెలిపారు. ఇక సీబీఐ ఛార్జిషీటులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరుండడంపై ఆనం వివరణ ఇచ్చారు. సబిత అవినీతి పరురాలని సీబీఐ ఎక్కడా పేర్కొనలేదని, వైఎస్ ప్రోద్భలంతోనే వివాదాస్పద ఫైళ్ళపై మంత్రులు సంతకాలు చేశారని ఆయన స్పష్టం చేశారు.