: మేము ముందునుంచి చెబుతూనే ఉన్నాం... ఇప్పుడదే జరిగింది: అశోక్ బాబు
విభజన అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియను ఇంతవరకు పూర్తి చేయకపోవడం వల్ల కింద స్థాయి పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. విభజన తర్వాత ఎక్కువగా నష్టపోతున్నది ఉద్యోగులే అని వాపోయారు. సచివాలయం పంపిణీలో కూడా తీరని అన్యాయం జరిగిందని... ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన భవంతుల్లో సరైన సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవోలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావించడం సరైంది కాదని అశోక్ బాబు అన్నారు. విభజనతో చోటుచేసుకునే పరిణామాలను తాము మొదట్నుంచి చెబుతూనే ఉన్నామని... ఇప్పుడవే జరుగుతున్నాయని వెల్లడించారు. ఏపీ రాజధాని ఎక్కడనే విషయాన్ని త్వరగా తేల్చాలని... లేకపోతే, ఉద్యోగులు ఆప్షన్లపై తేల్చుకోలేరని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు.