: వరకట్నం కేసుల్లో బంధువులకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
వరకట్న వేధింపుల కేసుల్లో అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న మరణాల కేసులో నిందితుడిగా ఓ వ్యక్తిని చేర్చాలంటే ఆ వ్యక్తి మృతురాలి భర్తకు రక్త సంబంధీకులై ఉండాలని, లేని పక్షంలో దత్తత ద్వారా సంబంధం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసిన సమన్ల విషయమై సుప్రీంను ఆశ్రయించిన పంజాబ్ ప్రభుత్వ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సీకే ప్రసాద్, జస్టిస్ పీసీ ఘోష్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
భర్తకు రక్త సంబంధం, వివాహం లేదా దత్తత ద్వారా సంబంధం ఉన్న వ్యక్తినే వరకట్న మరణాల కేసుల్లో నిందితుడిగా విచారించాలని తేల్చింది. ఈ మేరకు వరకట్న మరణం కేసులో ఒక వ్యక్తికి జారీ చేసిన సమన్లను పంజాబ్, హర్యానా హైకోర్టు రద్దు చేసింది. ఆ వ్యక్తి మృతురాలి భర్తకు వరసకు సోదరుడు కావడంతో, కోర్టు నిర్వచించిన రక్త, వివాహ, దత్తత సంబంధం పరిధిలోకి రానందున, ఈ కేసులో అతడిని విచారించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 304బి లో ‘బంధువు (రిలెటివ్)’ అనే పదానికి సుప్రీంకోర్టు కచ్చితమైన నిర్వచనం ఇచ్చినట్టైంది.