: హర్భజన్ నమ్మించి గోతులు తీసే వ్యక్తి: శ్రీశాంత్
ఐదేళ్ళ క్రితం ఐపీఎల్ లో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పేసర్ శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడం.. దాంతో ఆ కేరళ చిన్నోడు కన్నీళ్ళ పర్యంతం కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సంఘటన శ్రీశాంత్ కు బాగా ప్రాచుర్యం తెచ్చిపెట్టింది. అయితే ఆ వివాదాన్ని అందరూ మరిచిపోయిన తరుణంలో ఇన్నాళ్ళకు మళ్ళీ దాన్ని తిరగతోడుతున్నాడు శ్రీశాంత్. హర్భజన్ ను 'నమ్మించి వెనుక గోతులు తీసే వ్యక్తి' అని వ్యాఖ్యానించి కొత్త రగడకు తెరదీశాడు.
నిన్న బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ గంభీర్, బెంగళూరు సారథి కోహ్లీ మధ్య చోటు చేసుకున్న మాటలయుద్ధం శ్రీశాంత్ కు నాటి ఘటనను గుర్తుకుతెచ్చింది. ఈ నేపథ్యంలో ఆనాడు ఏం జరిగిందనే విషయాలను తాజాగా ట్విట్టర్ లో పంచుకున్నాడు శ్రీ.
'భజ్జీ చెంపదెబ్బ కొట్టిన సమయంలో నేను తీవ్ర భావోద్వేగాలకు లోనవడం పట్ల అందరూ నన్నే తప్పుబట్టారు. కానీ, హర్భజన్ నమ్మకంగా ఉంటూ వెనుక గోతులు తీసేవాడని తెలిసిన తర్వాత ఎమోషనల్ కాకుండా ఎలా ఉంటాం?' అని ప్రశ్నించాడు. 'ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది తప్పెవరిదో' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. అయితే తనను హర్భజన్ చెంప మీద కొట్టలేదని, మోచేతితో నెట్టాడని శ్రీ తెలిపాడు.