: 'దుబాయ్ శీను' సీను రిపీటయ్యింది!
రవితేజ నటించిన 'దుబాయ్ శీను' సినిమాలో హీరో సహా కొందరు నిరుద్యోగులను ఓ మోసగాడు వంచించడం తెలిసిందే. సరిగ్గా రియల్ లైఫ్ లోనూ ఇలాగే జరిగింది. స్విట్జర్లాండ్ లో ఉద్యోగాలిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి కోటికి పైగా వసూలు చేసిన ఓ ప్రైవేటు సంస్థ నయవంచన వెలుగులోకి వచ్చింది. బాధితులందరూ స్విట్జర్లాండ్ వెళ్ళేందుకని శంషాబాద్ విమానాశ్రయానికి రాగా అక్కడ సదరు సంస్థకు చెందిన ఏజెంట్లు ఎవరూ కనిపించలేదు. దీంతో, తాము మోసపోయామని గ్రహించిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తమను నమ్మించి మోసం చేశారంటూ సంస్థకు చెందిన ఏజెంటు ప్రవీణ్, యూసూబ్ అనే మరో వ్యక్తిని చావబాది పోలీసులకు అప్పగించారు. తమకు న్యాయం చేయాలంటూ శంషాబాద్ ఆర్ జీఐ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు.