: షారుక్ కు ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం ప్రదానం
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక వైవిధ్యానికి తనదైన కృషి చేసిన ఖాన్ కు 'నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్' అవార్డును ఆ దేశ విదేశాంగ మంత్రి లారెంట్ ఫ్యాబియస్ ప్రదానం చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన ముంబయిలో నిన్న జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని పొందినందుకు తనకు చాలా గర్వంగా ఉందని, కృతజ్ఞత కలిగి ఉంటానని షారుక్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ రోజు తన తల్లి పుట్టిన రోజని, ఆమె గనుక జీవించి ఉంటే అవార్డు పొందినందుకు చాలా సంతోషించి ఉండేదని తెలిపాడు. కాగా, సీనియర్ నటుడు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత ఈ పురస్కారం పొందిన ద్వితీయ భారత నటుడు షారుక్ కావడం విశేషం.