: రాజమౌళి పొరబడ్డారు!
కచ్చితమైన సమాచారం ఉంటేనే మాట్లాడతారని టాలీవుడ్ డైరక్టర్ రాజమౌళికి సినీ వర్గాల్లో పేరుంది. అలాంటి వ్యక్తి సైతం పొరబడ్డారు. ఆదివారం సాయంత్రం హైదరాబాదు శిల్పకళావేదికలో బడా నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కిన 'అల్లుడు శీను' ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మైక్ అందుకుని, ఈ సినిమా కోసం వినాయక్ తీవ్రంగా కష్టపడ్డాడని, చిరంజీవి గారి 'స్టాలిన్' కు కూడా అంత కష్టపడి ఉండడని అన్నారు. దీంతో, అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వాళ్ళ ఆశ్చర్యానికి కారణమేంటంటే... 'స్టాలిన్' కు దర్శకత్వం వహించింది మురుగదాస్. వినాయక్... చిరుతో తెరకెక్కించింది 'ఠాగూర్'. ఈ క్రమంలోనే రాజమౌళి పొరబడి ఉంటారని పలువురు ముచ్చటించుకున్నారు.
ఇక, తనదైన శైలి వాగ్ధాటితో బ్రహ్మానందం సభికులను నవ్వించారు. అయితే, హీరో సాయి శ్రీనివాస్ గురించి చెబుతూ, డ్యాన్సులు ఇరగదీశాడని, ఫైట్లు చింపేశాడని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. చివరగా హీరోయిన్ ను నలిపేశాడని బ్రహ్మీ అనేసరికి హీరో శ్రీనివాస్ విపరీతంగా సిగ్గుపడిపోయాడు.
కెమెరాలో అతని ముఖంలో భావాలు స్పష్టంగా కనిపించాయి. బ్రహ్మానందం కామెంట్ పై ఆడియో ఫంక్షన్లో పలువురు స్పందిస్తూ, 'ఇదేంటి, ఇలా అన్నారు' అనుకోవడం కనిపించింది. కాగా, ఈ సినిమాలో బెల్లంకొండ తనయుడి సరసన సమంతా నటించడం విశేషం.