: ఒబామాతో బెల్జియం ప్రధాని బీరు పందెం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పందెం కాయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? ఎంత ఖలేజా ఉండాలి? అవన్నీ తనకు ఉన్నాయంటూ బెల్జియం ప్రధాని ఎలియో డి రూపో ఏకంగా అగ్రరాజ్యాధిపతితో బీరు పందెం కాశారు. ఇంతకీ, పందెం ఏ విషయంలో అనేగా సందేహం! బ్రెజిల్ లో జరుగుతున్న ఫిఫా సాకర్ వరల్డ్ కప్ లో నేటి నుంచి నాకౌట్ దశ పోటీలు జరగనున్నాయి. ఈ రౌండ్ లో అమెరికాతో బెల్జియం జట్టు తలపడుతోంది. గెలిచిన జట్టు ముందుకు, ఓడిన జట్టు ఇంటికి వెళతాయి. ఈ మ్యాచ్ విషయమై బెల్జియం ప్రధాని ట్విట్టర్లో ఒబామానుద్దేశించి ట్వీట్ చేశారు. 'హేయ్ ఒబామా, మా జట్టే గెలుస్తుందని గ్రేట్ బెల్జియన్ బీర్లు పందెం కాస్తున్నాను, కాచుకో!' అంటూ ట్వీట్ వదిలారు. కాగా, దీనిపై ఇంకా ఒబామా స్పందించాల్సి ఉంది.