: మిస్డ్ కాల్ ప్రేమ...
అనుకోకుండా వెళ్ళిన మిస్డ్ కాల్ ఆ యువతి జీవితాన్ని గందరగోళంలోకి నెట్టింది. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మొయినుద్దీన్ కొన్నేళ్ల క్రితం హైదరాబాదు వలస వచ్చాడు. సిమెంట్ దుకాణంలో పనికి కుదిరాడు. మూడేళ్ల క్రితం మొయినుద్దీన్ అండమాన్ లోని తన తల్లిదండ్రులకు ఫోన్ చేయబోయి కోల్ కతాలోని మిత్తు (22) నెంబర్ కి ఫోన్ చేశాడు. తరువాత మిస్డ్ కాల్ నెంబర్ కు ఫోన్ చేసిన మిత్తుతో మొయినుద్దీన్ మాటలు కలిపాడు.
నెమ్మదిగా ఆమెను ముగ్గులోకి లాగాడు. ప్రేమిస్తున్నానన్నాడు. పెళ్లి చేసుకుందాం వచ్చేయమని మిత్తును కోరాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా, మూటాముల్లె సర్దుకుని వచ్చేసింది. యూసుఫ్ గూడలో రూం తీసుకుని మిత్తుతో మొయినుద్దీన్ కాపురం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఎలాగోలా ఒప్పించి అబార్షన్ చేయించాడు.
మళ్లీ ఆమె ఒత్తిడి చేయడంతో ఆమెతో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోరని మొయినుద్దీన్ తేల్చిచెప్పాడు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మొయినుద్దీన్ ను అరెస్టు చేయడంతో అతనిని వదిలేయాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసిన తరువాత వదిలేయడం కుదరదని పోలీసులు స్పష్టం చేయడంతో 'కేసు ఉపసంహరించుకుంటాను, అతనిని విడుదల చేయండ'ని కోరుతోంది.