: తెలంగాణ గవర్నమెంటుకి సూచన: బాబు
తెలుగు జాతి కలసి ఉండాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భాష ఒకటే, సంప్రదాయం ఒకటే, బంధాలు ఒకటేనని అన్నారు. అనవసరంగా విద్వేషాలు రేపి ప్రజల్ని విడదీయాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు. పొట్టి శ్రీరాములు తెలుగువారికి గౌరవం కావాలని, న్యాయం జరగాలని మద్రాసు రాష్ట్రం నుంచి ప్రాణాలు ఫణంగా పెట్టి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా చేశారని అన్నారు.
తెలుగుజాతి ఏకమవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాదును కలుపుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు కొంత మంది రాజకీయ స్వార్థం కోసం మరోసారి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు. ఆంధ్రులు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని కోరుకోలేదని, తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రులకు అన్యాయం చేద్దామని ఏనాడూ ప్రయత్నించలేదని ఆయన వెల్లడించారు.
సచివాలయంలో 80 వేల ఉద్యోగాలు ఉండాలి... కానీ, 50 వేల ఉద్యోగులు మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వార్ రూం పెట్టి విభేదాలు రేపాలని చూశారని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా విద్యుత్ విషయంలో వివాదాలు రేపి విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా మంది చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దానిని పరిష్కరించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రంలోని వివిధ విభాగాలతో సంప్రదించి సమస్య పరిష్కరిస్తానని ఆయన అన్నారు.