: అమెరికాకు త్వరలో మహిళా దేశాధ్యక్షురాలు: మిచెల్లీ ఒబామా
అగ్రరాజ్యం అమెరికాకు ఓ మహిళ త్వరలో దేశాధ్యక్షురాలు కానుందని అధక్ష్యుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా అన్నారు. సాధ్యమైనంత తొందరలో ఒక మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు అమెరికా రెడీగా ఉందని చెప్పారు. ఈ జాబ్ లో ఎవరున్నా అంగీకరించేందుకు దేశం సిద్ధంగా ఉందన్నారు. అందుకు జాతి, లింగ బేధం, సామాజిక-ఆర్థిక స్థితి నేపథ్యం గానీ అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి అత్యంత అర్హులైన వ్యక్తి అయితే చాలని అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అతిథిగా హాజరైన మిచెల్లీను, రానున్న ఎన్నికల్లో మహిళ దేశాధ్యక్షురాలుగా ఎన్నికవుతారా? అంటూ అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. వెంటనే చప్పట్లతో ఆమెను ప్రశంసించారు. కాగా, 2016లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. యూఎస్ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో మిచెల్లీ మాట్లాడినట్లు విశ్లేషకులు అంటున్నారు.