: గురుకుల్ ట్రస్ట్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోండి: కేసీఆర్
హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరున్న గురుకుల్ ట్రస్ట్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గురుకుల్ భూముల అన్యాక్రాంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం డీజీపీ, ఇద్దరు సీపీలు, నలుగురు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రుల అండతో భూములు అన్యాక్రాంతం అవుతున్నా జీహెచ్ ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని మండిపడ్డారు. అక్రమ కట్టడాలను వెంటనే ఆపించాలని అన్నారు. అక్రమ నిర్మాణాలకు కరెంట్, నీరు ఎలా సరఫరా చేస్తున్నారని జీహెచ్ ఎంసీ అధికారులపై మండిపడ్డారు. వెంటనే కబ్జాదారులను ఖాళీ చేయించాలని ఆదేశించారు. కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.