: టీడీపీని విమర్శించడమే మా పని కాదు: జగన్
అధికార పార్టీని విమర్శించడమే తమ పని కాదని విపక్ష నేత జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, అధికారం అంటే నిరాశ నిస్పృహలను పెంచడం కాదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉందని చెప్పారు. అభివృద్ధిలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 9వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు 15 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఏ స్థానానికి తీసుకెళ్తారోనని ఆయన చమత్కరించారు.
సౌకర్యాలు, వసతులు, వనరులు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. గుజరాత్ లో ఐటీ పరిశ్రమ లేకపోయినా అభివృద్ధి సాధించిందని జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి టీడీపీ నేతలు పలుమార్లు అడ్డు తగిలారు. తాను చెప్పాలనుకుంటున్న విషయం పూర్తిగా విని, ఆ తరువాత అభ్యంతరం చెప్పాలని జగన్ అధికార పక్షం నేతలకు సూచించారు.