: తల్లిదండ్రుల ఒడికి చేరిన చిన్నారి శ్రాగ్వి
ఈనెల 6వ తేదీన అపహరణకు గురయిన చిన్నారి శ్రాగ్వి ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరింది. చిన్నారిని పోలీసులు క్షేమంగా కొంతసేపటి కిందట వారికి అప్పగించారు. శ్రాగ్వి కనిపించడంతో కుటుంబసభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనంతరం చిన్నారిని పోలీసులు మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన హైదరాబాదు కమిషనర్ అనురాగ్ శర్మ, పాపను తల్లిదండ్రులకు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు.
అయితే, పాప అపహరణకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని చెప్పారు. చిన్నారిని అపహరించింది కుటుంబ స్నేహితుడు రావుల భరత్ గా గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. అపహరణ జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారని, ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామనీ అన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చిన్నారి ఆచూకీని కనిపెట్టిన పోలీస్ టీమ్ ను అనురాగ్ శర్మ అభినందించారు. ఇదే సమయంలో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.