: మోడీని గౌరవించేందుకు అమెరికా పార్లమెంటేరియన్ల తహతహ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. నిన్నటిదాకా తమ దేశంలోకి మోడీకి అనుమతి లేదని బీరాలు పలికిన అమెరికా, భారత ప్రధాని పీఠంపై ఆయన కూర్చోగానే తన బాణీని మార్చేసింది. దక్షిణాసియాలో రాజకీయ, ఆర్థిక, భద్రతలతో పాటు మరే ఇతర అంశంలోనైనా భారత్ తమకు అత్యంత ప్రాధాన్యత గల దేశమంటూ కీర్తిస్తూ స్పీకర్ జాన్ బోయెనర్ కు అమెరికా ప్రతినిధుల సభలో విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎడ్ రాయిస్ శుక్రవారం ఓ లేఖ రాశారు.
అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశ ప్రధానిగా మోడీని ప్రతినిధుల సభతో పాటు సెనేట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ఆహ్వానించాలని ఆయన తన లేఖలో కోరారు. లేఖపై ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయెనర్ అంత త్వరగా స్పందించలేదు. అయితే మోడీకి ఆహ్వానం వెళ్లడం ఖాయమన్న వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ లో అమెరికాలో పర్యటించనున్న మోడీ ఆ దేశ ఉభయ సభల్లో ప్రసంగించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పీఠమెక్కిన తొలి నాళ్లలో 2002లో గోద్రా అల్లర్లలో వెయ్యి మందికి పైగా ముస్లింలు ఊచకోతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2005లో మోడీకి తమ దేశ వీసా ఇచ్చేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ నిరాకరించారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాశానికెత్తేశారు. అంతేకాక తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానం కూడా పంపిన సంగతి విదితమే.